Sep 22, 2011

2జీ స్కామ్‌లో చిదంబరం స్పెక్ట్రం వేలంలో రాజాతో కుమ్మక్కు?

పీఎంవోకు ఆర్థిక శాఖ పంపిన నోట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ:
2జీ స్పెక్ట్రం కుంభకోణంలో తన ప్రమేయమేమీ లేదంటూ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఎంత తప్పుకోజూసినా, సీబీఐ కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినా.. అది సాధ్యపడేట్లు లేదు. చిదంబరం, మాజీ టెలికాం మంత్రి రాజా కూడబలుక్కుని దీనికి తెరతీశారనడానికి ఆధారాలు బైటపడుతున్నాయి. రాజా నిర్ణయాలను పక్కన పెట్టి మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు అవకాశమున్నా చిదంబరం ఆ పని చేయలేదని తెలుస్తోంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన ఆర్థిక శాఖే స్వయంగా కొన్నాళ్ల క్రితం ప్రధాని కార్యాలయానికి(పీఎంవో) పంపిన నోట్‌లోని వివరాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. 2జీ కేటాయింపుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ప్రమేయం ఈ నోట్‌లో స్పష్టంగా పేర్కొని ఉంది.

4.4 మెగాహెట్జ్ దాకా స్టార్ట్ అప్ స్పెక్ట్రంను వేలం వేయకూడదని చిదంబరం, రాజా ఏకతాటిపై నిల్చిన వైనాన్ని ఇది బహిర్గతం చేసింది. అలాగే, ఎంట్రీ ఫీజు, ఇతర చార్జీలు మళ్లీ సమీక్షించకూడదని కూడా ఇద్దరూ భావించిన విషయాన్నీ వెల్లడించింది. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా అరెస్టయిన నె ల్లాళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 25న ప్రధాని కార్యాలయం జాయింట్ సెక్రటరీ వినీ మహాజన్‌కు ఆర్థిక శాఖ డిప్యూటీ డెరైక్టర్ పీజీఎస్ రావు 11 పేజీల నోట్ పంపారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా దీన్ని ఆమోదించారు కూడా. ఆర్‌టీఐ కార్యకర్త వివేక్ గర్గ్ చొరవతో ఈ నోట్ వివరాలు వెల్లడయ్యాయి.


2001 నాటి ఎంట్రీ ఫీజులకే 2008 డిసెంబర్‌లో కూడా స్పెక్ట్రంను కేటాయించడం ద్వారా రూ. 1,76,000 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండిపడిందని ఆరోపణలు రావడం తెలిసిందే. అయితే, ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడే ఈ ఛార్జీలు సరైనవి కావంటూ నోట్ తయారు చేశారు. 2001 నాటి ఎంట్రీ ఫీజైన రూ. 1,600 కోట్లు ప్రస్తుత మార్కెట్ ధర కానే కాదంటూ 2007 నవంబర్ 22న తయారు చేసిన ఒక నోట్‌లో ఆయన పేర్కొన్నారు. కానీ ఇది బుట్టదాఖలైంది. 2008 డిసెంబర్ దాకా కేటాయించిన లెసైన్సులకు 2001 నాటి ఎంట్రీ ఫీజునే వసూలు చేయాలన్న ప్రతిపాదనకు చిదంబరం సారథ్యంలోని ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దువ్వూరి నోట్‌ను రాజా, చిదంబరం పట్టించుకోలేదనడానికి నిదర్శనంగా ‘ఆయా మంత్రుల స్థాయిలో ఏకాభిప్రాయం కారణంగా స్టార్ట్-అప్ లెవెల్‌ని దాటిన (4.4 మెగాహెట్జ్) స్పెక్ట్రంను మాత్రమే వేలం వేయాలని నిర్ణయించారు’ అని పీఎంవోకి పంపిన తాజా నోట్‌లో ఆర్థిక శాఖ వెల్లడించింది.


చిదంబరం పట్టుపట్టి ఉంటే..


ఆఖరికి స్పెక్ట్రం కేటాయిస్తూ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌లను (ఎల్‌వోఐ) జారీ చేసిన నెల రోజుల తర్వాత కూడా రాజా నిర్ణయంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2008 ఫిబ్రవరి 11న ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ మేరకు అంతర్గత నోట్‌ను తయారు చేసింది. కొత్త, పాత ఆపరేటర్లకు కూడా మొత్తం స్పెక్ట్రంకు చార్జీలు విధించాలన్న ప్రతిపాదన అందులో ఉంది. కానీ అవి కూడా బుట్టదాఖలయ్యాయి. రెండు నెలల తర్వాత 2008 ఏప్రిల్ 21న రాజాకు చిదంబరం పంపిన పత్రం ప్రకారం.. 4.4 మెగాహెట్జ్ పైన స్పెక్ట్రంను మాత్రమే వేలం వేసేలా నిర్ణయం తీసుకోవచ్చంటూ సూత్రప్రాయంగా తెలిపారు. టెలికాం శాఖ కోరుకున్నది కూడా ఇదే. ముందు నుంచీ భావించినట్లు 4.4 మెగాహెట్జ్ దాకా స్పెక్ట్రంను కూడా వేలం వేయాలంటూ ఆర్థిక శాఖ గానీ గట్టిగా పట్టుబట్టి ఉంటే.. టెలికాం శాఖ కచ్చితంగా లెసైన్సులు రద్దు చేయాల్సి వచ్చేదని పీఎంవోకు పంపిన తాజా నోట్ పేర్కొంది. ఎల్‌వోఐలను జారీ చేసినప్పటికీ.. స్పెక్ట్రం ధరలను సవరించేందుకు ఆర్థిక వ్యవహారాల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొంది.


గతం గతః


పెపైచ్చు.. స్పెక్ట్రం వ్యవహారాన్ని పూర్తిగా కప్పిపుచ్చేందుకు కూడా చిదంబరం ప్రయత్నించారని తెలుస్తోంది. టెలికాం శాఖ 121 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)ను కంపెనీలకు జారీ చేసిన అయిదు రోజుల తర్వాత.. 2008 జనవరి 15న ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చిదంబరం ఒక రహస్య నోట్ రాశారు. స్పెక్ట్రం కేటాయింపులను ‘ముగిసిన అధ్యాయం’గా పరిగణించాలని పీఎంవోకు పంపిన నోట్‌లో ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా యూపీఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించవచ్చునన్నది కూడా చిదంబరం తన లేఖలో వివరించారు.


సుప్రీం కోర్టులో ఆర్థిక శాఖ పత్రం

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం అంశంపై ఈ ఏడాది మార్చి 25న ప్రధానికి ఆర్థిక శాఖ పంపిన నోట్‌ను జనతా పార్టీ అధినేత సుబ్రహ్మణ్యం స్వామి బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించారు. స్పెక్ట్రం వివాదంలో చిదంబరం పాత్రపై విచారణ జరపాలని కోరుతున్న స్వామి.. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ.. రాజాని మాత్రమే బాధ్యుడిని చేస్తోందని పేర్కొన్నారు. స్పెక్ట్రం ధరల నిర్ణయంపై నాలుగు సమావేశాలు జరిగాయని, ఆఖరు సమావేశంలో ప్రధానితో చిదంబరం, రాజా కలిసి చర్చించారని స్వామి తెలిపారు. స్వామి సమర్పించిన నోట్ ప్రకారం 4.4 మెగాహెట్జ్ ప్రాథమిక స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ఫిబ్రవరి 2008లో ఆర్థిక శాఖ కార్యదర్శి సూచించారు. కానీ, అప్పటికే, ఎంట్రీ ఫీజు చెల్లించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) హోల్డర్లు కోర్టుకు వెడతారనే సాకుతో టెలికాం శాఖ దీనికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. లెసైన్సు కోసం కట్టిన ఎంట్రీ ఫీజునే.. ప్రాథమిక స్పెక్ట్రం ధరగా పరిగణించవచ్చునని భాష్యం చెప్పింది. 2008 మే 29న, 2008 జూన్ 12న కూడా చిదంబరం, రాజా సమావేశమైనట్లు నోట్‌లో ఉంది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 4న ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీలో చిదంబరం, రాజా కూడా పాల్గొన్నారు.

No comments: