Aug 29, 2011

రంగు వినాయకులకు బై బై చెబుదాం ! ఎకో ( సహజమైన ) మట్టితో తయారు చేసిన వినాయకులను పూజిద్దాం !



వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, రకరకాల నామ ధేయాలతో దేశ ప్రజల పూజలందుకునే పార్వతీ తనయుడి ప్రత్యేకతలకు లెక్కేలేదు. సంస్కృతంలో 'వి' అన్న ధాతువును రెండు రకాలుగా విశేషంగానూ వ్యతిరేకార్థంలోనూ వాడతారు. వి అంటే విశేషణం, విలక్షణం కూడా. మరో వైపున వి అంటే వ్యతిరేకార్థం కూడా ఇస్తుంది. చాలా మంది నాయకులను వినాయకులు అనడానికి కారణమదే. ఈ కలియుగ వినాయకుల ధాటికి అసలు వినాయకుడి జాతకం మారిపోవడం వినాయక చవితికి మనం బాగా చూడొచ్చు. మరే పండుగ కన్నా మిన్నగా మరే దేవుడి కన్నా మిక్కుటంగా వినాయక చవితి సందర్భంలోనే విశ్వాసాలూ రాజకీయాలూ పెనవేసుకుపోతాయి.
విఘ్నాధిపతిగా కీర్తించబడే వినాయకుడి విగ్రహాలే పర్యావరణకు విఘ్నాలుగా తయారు కావడానికి కారకులు అభినవ వినాయకులే. షరా మామూలుగా ఈ సారి కూడా వినాయక విగ్రహాల తయారీలో పర్యావరణ కోణాన్ని గురించి వివిధ సంస్థలు నొక్కి చెబుతున్నప్పటికీ పరిస్థితి పెద్దగా మారుతుందనే ఆశ అంతగా లేదు. ఆ సంగతి రాబోయే రోజులకు వదిలేసి ప్రస్తుతం వినాయక విశేషార్ణవంలోకి వెళదామా...
భైరతాబాదు నుంచి గాజువాక వరకూ
రికార్డుల జ్వరం వినాయకుడికి కూడా తాకడంతో ఎంత పెద్దగా చేయాలనేదానిపై పోటీ పెరిగింది. రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయానికి వెనకనే ఖైరతాబాదు వినాయకుడు అలా అలా పెరిగి పెరిగి ఇప్పుడు అరవై అడుగుల వరకూ చేరాడు. ఈ ఉత్సవాలకు మూల పీఠమైన ముంబాయిలోనే 25 అడుగులు దాటడం అరుదని పరిశీలకులు చెబుతుంటే ఖైరతాబాద్‌లో ఈ సారి 55 అడుగుల మేరకు చేస్తున్నట్టు నమూనా విడుదల చేశారు. ఇందులో వేదిక భూగోళం ఆకారంలో 5 అడుగులు, ఎలుక పదిహేను అడుగులు అసలు విగ్రహం 30 అడుగులు సర్పం మరో అయిదు అడుగులు వుంటుందట. ఈ విగ్రహం చేతిలో పట్టుకునే లడ్డూ తాపేశ్వరం నుంచి ... భారీగా తయారై వస్తోందట! ఖైరతాబాద్‌ రికార్డును బద్దలు కొడుతూ ఇప్పుడు విశాఖ గాజువాక వినాయకుడు 108 అడుగుల ఎత్తున తయారవుతున్నాడు. దాని చేతిలో లడ్డు కూడా తాపేశ్వరం తయారీనే. వీటని నిర్మించడం, అమర్చడం, తరలించడం ఎంత వ్యయప్రయాసలతో కూడిందో వూహించుకోవచ్చు.

ఖరీదైన లడ్డూ
విగ్రహాల పరిమాణంతో పాటు వాటి చేతిలోని లడ్డూ ఖరీదు కూడా పెద్ద పోటీగా తయారైంది. ఖైరతాబాదు కన్నా బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ ఎక్కువ రేటు పలికింది. గత ఏడాది దీనికి 5 లక్షల పైచిలుకు చెల్లించారు. గాజువాక కూడా ఇదే కోవలో చేరుతుంది. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌లో ఆ ధరలు చెల్లించడం పెద్ద పని అనిపించలేదు గాని దీనికి భక్తికి ఏం సంబంధం అని భక్తులు కూడా విస్తుపోతుంటారు. వినాయకుడుకి వున్న మూడు పేర్లు కూడా అర్థవంతమైనవే. వినాయకుడు అంటేనే మంచి నాయకుడు అని. అలాగే గణేషుడు అంటే గణానికి నాయకుడు అని. ఒకప్పుడు ఆది మానవులు గణాలుగా జీవించే వారన్న సంగతి తెలిసిందే కదా.

గణపతి, గణేశుడు అన్న మాటలు కూడా ఆ విధమైన అర్థాన్నే సూచిస్తాయి. గజాననుడు అంటే ఏనుగు ముఖం గల వినాయకుడు ఎలుక వాహనంపై వూరేగుతుంటాడు. ఆ రీత్యా ఆయన ఏనుగు ఎలుక గుర్తుగల గణాలకు నాయకుడు అన్న అర్థం కూడా వుంది. అతి పెద్దదైన ఏనుగును అతి చిన్నదైన ఎలుక రెండు వేర్వేరు గణాలకు చిహ్నాలనుకుంటే ఆ రెండు గణాలకు సయోధ్య చేసి నాయకుడైన వాడు అని కూడా అనుకోవచ్చు. శైవ మతంలో గణాపత్య అనే శాఖ వారు ఆయన ఆరాధనను ప్రధానంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. గణ నాయకుడుగా చూసినా విఘ్న నాయకుడుగా చూసినా ఆయన పూజతో కార్యక్రమం మొదలు కావాలన్న భావం పాతుకు పోయింది.
ఏ పని తలపెట్టినా ఏవో విఘ్నాలు, ఆటంకాలు కలుగుతుంటాయి గనక వాటికి నాయకుడైన విఘ్నేశ్వరుడిని పూజిస్తుంటారు. ఆ విధంగా వినాయక పూజతో ప్రతిపనికీ శ్రీకారం చుట్టడం సంప్రదాయంగా మారింది. వివాహ ఆహ్వాన పత్రికలపై ఒకప్పుడు ఎందరో దేవతలు వుంటే ఇప్పుడు వినాయకుడే అగుపించడానికి కూడా కారణమదే.వినాయకుడి బొమ్మను చిత్రకారులు రకరకాల రేఖా విన్యాసాలతో రూపొందించడం చూస్తుంటాము. వినాయకుడంటే విద్యా బుద్ధులకు కూడా అధిదేవతగా పూజలందుకుంటాడు. వినోదానికి కూడా ఆలవాలంగా అలరారుతుంటాడు గనకే ఈ పండుగ వచ్చిందంటే కార్టూనిస్టులు సరదాల పండగ చేసుకుంటారు.

మిగిలిన దేవతల్లా గాక గణేశ ప్రతిమలలో విపరీతమైన వైవిధ్యం కనిపిస్తుంది. నిల్చున్నట్టు, కూర్చున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు, రాక్షసులను సంహరిస్తున్నట్టు, ఆడుకుంటున్నట్టు, ఇలా ఎన్నో రకాలుగా వుండటం పురాతన కాలం నుంచే గమనిస్తాం. మొత్తం ముప్పై మూడు రకాలుగా వినాయక ప్రతిమలున్నట్టు పరిశోధకులు చెబుతారు. బహుశా ఈ వైవిధ్యం రానురాను మరింతగా విస్తరించింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో బాల గంగాధర తిలక్‌ 1893లో గణేశ ఉత్సవాలు జరపడం ద్వారా దేశభక్తిని పెంపొందించేకు ప్రయత్నించాడు. మిగిలిన పండుగలకు లేని ప్రాచుర్యం వినాయక చవితికి రావడానికి కారణమేమంటే ఆయన ప్రతివారికి అందుబాటులో వుంటాడన్న భావనే.
బ్రాహ్మణ బ్రాహ్మణేతరులను ఏకం చేయడానికి గణేశ ఉత్సవాలు మంచి సందర్భాలని తిలక్‌ భావించాడు. అంతకు ముందు కాలంలో విగ్రహాలు ఇళ్లలో పెట్టుకునే హక్కు బ్రాహ్మణులకు మాత్రమే వుంటుందని పురాతన వర్ణ వ్యవస్థ సిద్ధాంతం. అందుకే ఇతరుల కోసం దేవాలయాలు కట్టించి భక్తి పద్ధతి పెంపొందించారు. ఆ దేవుడి గర్భగుడిలోకి కూడా ఇతరులు వెళ్లకూడదు గనక ఉత్సవాల సందర్భంలో వూరేగించి అందరూ పూజించుకోవడానికి వీలుగా ఉత్సవ విగ్రహాలను సృష్టించారు.ఈ నేపథ్యంలో వినాయకుడి విగ్రహాలను మాత్రం అందరూ ప్రతిష్టించుకుని పూజించే పద్ధతి బాగా ఆదరణ పొందింది.

ఇప్పటి సంగతి..
ఇప్పటికీ తిలక్‌ స్వరాష్ట్రమైన మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి గాని శివసేన ఆధ్వర్యంలో వాటి స్వభావం పూర్తిగా మారిపోయింది. గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు మార్మోగుతుంటే గణేశ ఉత్సవాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. క్రమంగా ఇదే వరవడి హైదరాబాదుతో సహా దేశమంతటికీ పాకింది. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా ముగించడం పోలీసులకు పెద్ద సవాలుగా తయారైంది. ఈ క్రమంలో వినాయక విగ్రహాల తయారీ విధానం పర్యావరణానికి పెద్ద విఘ్నంగా మారిపోయింది.

వినాయక చవితికి బాగా ముందే ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేయడం, భారీ వ్యయంతో పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్టించడం రివాజుగా మారింది. ఈ పందిళ్లు, విగ్రహాలు ఎంత భారీగా వుంటే అంత హంగామా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆగష్టు సెప్టెంబరు మాసాల మధ్య వినాయక చతుర్థి వస్తుంది. దాంతో వినాయక రాత్రులు మొదలవుతాయి.ఎర్రమట్టి లేదా బంకమట్టితో చేసిన విగ్రహాలను పూజ చేసి పదిరోజుల తర్వాత అనంత చతుర్థి రోజున నీటిలో దాన్ని నిమజ్జనం చేయడం సంప్రదాయం. విగ్రహాలను అలా నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా అని పాడటానికి అర్థం వినాయకా మళ్లీ వచ్చే ఏడాదికి త్వరగా రా అని.
మామూలుగా అయితే వినాయక విగ్రహం పండుగకు రెండు మూడు రోజుల ముందు బంకమట్టితో తయారు చేయాలి. ఇంచుకన్నా చిన్న సైజుతో మొదలై 25 అడుగుల వరకూ దాన్ని పెంచేస్తారు. దాన్ని వేదికపై వుంచడాన్ని ప్రాణ ప్రతిష్ట అంటారు. తర్వాత చేసేవి షోడషోపచారాలు.(16 పూజా విధానాలు) బెల్లం, కొబ్బరితో పాటు 21 రకాల మోదకాలు, 21 రకాల పూలను సమర్పిస్తారు.ఇన్ని రోజుల పాటు భజనలు కీర్తనలు పూజా పురస్కారాలతో పరిసరాలు మార్మోగుతాయి.

ఇదంతా బాగానే వుంది గాని క్రమేణా వినాయక చవితి రూపం మారిపోయింది. మొదటి కారణం మత శక్తుల వ్యూహమైతే మరో కారణం ప్రతిదీ భారీ ఎత్తున చేయాలనే ధోరణులు పెరగడం. వినాయక చవితికి కొన్ని నెలల ముందుగానే ఉత్సవ కమిటీలంటూ ఏర్పాటు చేస్తారు. భక్తి భావంతో ఎవరికి వారు చేసుకోవలసిన పండుగను ఈ విధంగా తమ హస్త గతం చేసుకుని ఒక పెద్ద వలయం ఏర్పరుస్తారు. ఈ ఏడాది ఇన్ని పందిళ్లు వేయాలని కోటాలు వేసుకుని మరీ వేయిస్తారు. ప్రతివీధిలో కుర్రకారుతో సహా రకరకాల వారిని పోగుచేసి విరాళాల వసూలు మొదలు పెడతారు. మోతుబరులేమో పెద్ద ఖాతాలు వేయిస్తారు. ఇదిగాక వ్యాపార సంఘాల వంటివి కూడా తమ శక్తిని బట్టి భారీ వేడుకలకే సిద్ధమవుతాయి. అపార్ట్‌మెంట్ల సంసృతి ప్రబలిన రీత్యా ప్రతి చోటా తమ విగ్రహాన్ని తాము ఏర్పాటు చేసుకుంటారు. ఏతావాతా ఇవన్నీ కలసి వీధులన్ని విగ్రహాలమయమై పోతాయి.
సంఖ్య రీత్యా ఎక్కువ వుండటమే గాక విగ్రహాలను తయారు చేసే విధానం కూడా సమస్యగా మారిపోతున్నది. బంకమట్టితో చేసినప్పుడు ఎంత పెద్దవైనా ఏ సమస్య వుండేది కాదు. కాని క్రమేణా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో ఈ విగ్రహాలను చేస్తున్నారు. దాంతో అయితే భారీ ఎత్తున కోరిన విధంగా చేయొచ్చునంటారు.ఆ పైన ఆకర్షణ కోసం కృత్రిమమైన రంగులు వాడతారు. పండుగకు ఆరేడు మాసాల ముందునుంచే కళాకారులు అసంఖ్యాకంగా విగ్రహాలను చేయడం మొదలెడతారు. హైదరాబాదులో ధూల్‌పేటతో సహా వివిధ చోట్ల ఈ పని జరుగుతుంది.ఆ సమయంలో వెళ్లి చూస్తే అవన్నీ కార్ఖానాలుగా కనిపిస్తాయి.ఆ విగ్రహాలకు ధరలు కూడా కొన్ని వందల నుంచి వేలు పలుకు తాయి. వివిధ చోట్ల నుంచి వచ్చిన వారు వాటిని తీసుకుపోయి వేడుక మొదలు పెడతారు. ఆ సమయంలో హైదరాబాదు దారుల్లో ఎక్కడ చూసినా ఆటోల్లోనూ, డిసిఎంల్లోనూ విగ్రహాలు తీసుకుపోతున్న వారే కనిపిస్తారు. ఒక విధంగా ఇందులోనూ పోటీ. వీధుల మధ్యన కులాల వారీగా సంఘాల వారీగా కూడా వుంటుంది. చాలా చోట్ల దారులు మూసేసే విధంగా పందిళ్లు వేస్తారు. హైదరాబాదులో క్రమంగా పాతికేళ్లలో పాతుకు పోయిన ఈ సంస్కృతి ఇప్పుడు జిల్లాల్లోనూ కనిపిస్తుంది.
విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ను వాడటం, కాలుష్య కారకాలైన కృత్రిమ రంగులను పెద్ద ఎత్తున వినియోగించడం అన్నిటికన్నా పెద్ద సమస్య. దీనివల్ల పర్యావరణం దెబ్బ తినడమే కాదు, వాటిని నగరంలోని కాలువల్లో చెరువుల్లో నిమజ్జనం చేసినపుడు ఆ నీరు కూడా కలుషితమై పోతుంది. ఇందుకు ప్రధానంగా గురయ్యేది ఇప్పటికే కాలుష్య కాసారంగా వున్న హుస్సేన్‌ సాగర్‌ చెరువు. ప్రతిఏటా పర్యావరణ ప్రియులు కాలుష్య నివారణ అధికారులు గగ్గోలు పెడుతున్నా ఉత్సవ నిర్వాహకులు గాని ప్రభుత్వాధినేతలు గాని పట్టించుకోవడం లేదు. పోటీలు పడి విగ్రహాలు చేయడంతో పాటు వాటన్నిటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలించడం వల్ల రాకపోకలు స్తంభించిపోవడంతో పాటు నగరంలో వాతావరణం కూడా ఉద్రిక్తంగా మారుతుంది.
గత ఏడాది 43 వేలమంది పోలీసులను వినియోగించినా ఆఖరు వరకూ జనం బిక్కుబిక్కుమంటూనే గడిపారు. నిమజ్జనం రోజున నగరం దాదాపు స్తంభించిపోవలసిందే. అతి భారీగా వుండే ఖైరతాబాదు వినాయకుడు తెల్లవారుఝామున హుస్సేన్‌ సాగర్‌లో పడ్డాక గాని జనం వూపిరిపీల్చుకోరు. కొన్ని సార్లు ఈ ఉత్సవాలు ఉద్రిక్తతలకు కలహాలకు కూడా దారి తీశాయి.దీనిపై అప్పటి పోలీసు అధికారి భాస్కరరావు సమర్పించిన నివేదిక గణేశ నిమజ్జనోత్సవాలను ఎలా నిర్వహించాలో కూడా సూచనలు చేసింది.అయినా అటు నిర్వాహకులు గాని ఇటు ప్రభుత్వాధినేతలు గాని వాటిని అమలు చేయరు.రాజకీయ లబ్ధి కోసం అరక్షిత విధానాలను అలాగే అనుమతిస్తుంటారు. విగ్రహాల సైజు ఇందులో ముఖ్యమైంది.

వాటి పరిమాణం పెరిగిన కొద్ది మట్టితో చేసే ప్రసక్తి వుండదు.25 అడుగుల వరకూ మట్టితో చేయొచ్చని నిపుణులు చెబుతున్నా హంగామా, ఆకర్షణ కోరేవారికి సంతృప్తి లభించదు గనక కృత్రిమ పద్ధతులే పట్టుకుంటారు.ఈ క్రమంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వినియోగం తప్పనిసరిగా మారుతుంది. అలాగే సిమెంటు, కమ్మీలు కూడా వాడక తప్పదు. ఉపాధి కోసం దాంతో చేసే వాళ్లు ఏడాదిలో కొద్ది కాలం మినహా తక్కిన సమయమంతా వీటిని తయారు చేయడంలోనే నిమగమవుతారు. బజార్లలోనూ వీధుల్లోనూ విగ్రహాలు పెట్టుకోవాలనుకునే వారు వాటిని తెచ్చుకోవడం సులభమని అనుకుంటారు. ఆ విధంగా కాలుష్యం వద్దంటూనే పెంచడం జరుగుతుంటుంది. పైగా హుస్సేన్‌ సాగర్‌ కలుషితం కావడానికి ఇదొక్కటే కారణమా అంటూ ఇదేదో మత పరమైన సమస్యగా చూపించే ప్రచారాలు చేస్తుంటారు కొందరు.
2006 లో రాష్ట్ర హైకోర్టు ఉత్సవాలకు ముందే పర్యావరణ కాలుష్యం జరగకుండా చూడాలని ఉత్తర్వులు జారీ చేయడంతో పెద్ద దుమారమే లేవదీశారు. జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు రౌండ్‌ టేబుల్‌సమావేశాలు జరిపి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తే వారిపై ధ్వజమెత్తారు. ఇదేదో హేతువాదులు, కమ్యూనిస్టులు మత వ్యతిరేకులు చేస్తున్న పని అన్నట్టు చిత్రించారే తప్ప నిజంగా జరుగుతున్న నష్టాన్ని చక్కదిద్దే ఆలోచన చేయలేదు. ప్రభుత్వం కూడా సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప హైకోర్టులో గట్టిగా తన అభిప్రాయం చెప్పలేదు. జపాన్‌ నుంచి అప్పు తెచ్చి అయిదేళ్లలో సాగర్‌ కాలుష్య నివారణ చేస్తామని గొప్పలు పోయింది. ఇప్పుడు అయిదేళ్లు గడిచిపోయాయి గనక ఏ మేరకు నియంత్రించిందీ కనిపిస్తూనే వుంది.హైకోర్టు తీర్పు అమలు చేయడంపై తొందరపాటు తగదని పాలక పక్ష ఎంఎల్‌ఎలు అప్పుడు వెనక్కు లాగారు కూడా.ఇక ఉత్సవ నిర్వాహకులైతే కలిగే నష్టం గురించి ఆలోచించకుండా మత భావాలు ప్రేరేపించే ప్రకటనలు గుప్పించారు. అప్పటికి ఇప్పటికీ ఈ పరిస్థితి మారిందేమీ లేదు.

నిమజ్జనం అంటే ఏమిటి?
సైన్సు, పర్యావరణం వంటి వాటిని పక్కన పెట్టి పురాణాల ప్రకారం చూసినా ఇది పొరబాటే. ఎందుకంటే నిమజ్జనం అంటే బాగా కలిపేయడం. మజ్జిగ అన్న మాట అ విధంగా వచ్చిందే. 'నిరతి మజ్జనం నిమజ్జనం' అంటే బాగా కలిపేయడం. మట్టితో చేసిన విగ్రహాన్ని మట్టితోనే కలిపెయ్యడం ఇందులో పరమార్థం.కాని విగ్రహాలను చేసిందీ మట్టితో కాదు, అవి నీటిలో కలిసేదీ కరిగేదీ లేదు. పెద్ద పెద్ద క్రేన్లతో వాటిని లాంఛనంగా నీళ్లలో దింపడం, కాస్సేపట్లో ఒడ్డుకు చేరడం జరుగుతుంది. ఆ విగ్రహాల్లో వాడిన ఇనుప చువ్వలను తీసుకునిపోవడానికి వీధి పిల్లలు అప్పటికే సిద్ధంగా వుంటారు. మురికి మయంగా వున్న హుస్సేన్‌ సాగర్‌లో విగ్రహాలను వేయడమే ఒక విడ్డూరమైతే నిమజ్జనం కాకున్నా అక్కడే కలపాలని పట్టుపట్టడంలో ఏ విధమైన విశ్వాసాలు లేవు.

నగర రాజకీయాలపై ప్రాబల్యం కోసం పాకులాట మాత్రమే వుంది. పురాణాలన్నిటిలోనూ చెరువులు బావులు తవ్వించడమే పుణ్య కార్యమని చెబుతున్నాయి తప్ప విష పూరితం చేయమని చెప్పవు. సప్త సంతానాలనే వాటిలో జలాశయాలను భాగంగా చెబుతాయి. మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు గాని, భగవద్గీతలో కృష్ణుడు గాని ఈ విషయమే చెప్పారు. వటపత్ర శాయి అని విష్ణువును తాటాకుపై పడుకున్నట్టు చూపించడంలోనూ మూషికాన్ని వినాయక వాహనంగా చేయడంలోనూ ప్రకృతి ముద్ర ప్రస్ఫుటంగా వుంది. పర్వత రాజ పుత్రి పార్వతి అనడంలోనూ ప్రకృతి భావన వుంది. ఇన్ని విధాల ప్రకృతితో ముడిపడినవినాయక విగ్రహాలను ప్రకృతి సూత్రాలకు హాని కలిగించే విధంగా కాలుష్య భరితం చేయడం ఎక్కడి ధర్మం అంటే సమాధానం వుండదు.
ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయడమే పురాణ ధర్మం కాదు. ముందే చెప్పినట్టు ఒక సామాజిక నేపథ్యంలో మూల విరాట్టు ప్రతినిధులుగా వుత్సవ విగ్రహాలు తయారైనాయి.జనం మధ్యకు వచ్చే విగ్రహాలు చిన్నవిగా కదిలించడానికి వీలుగా వుండాలి. మరీ పెద్దవైతే ప్రజా భద్రతకు ప్రమాదం గనకే పల్లకీలోనో పారువేటలోనో వూరేగించేందుకు వీలైన పరిణామంలోనే చేస్తారు. అసలు ఉత్సవ విగ్రహాలు ఎంత వుండాలో కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. దేశంలో శ్రావణ బెళగొళ వంటి జైన దిగంబరుల విగ్రహాలు వుండేమాట నిజమే గాని అవి కదిలేవి కావు. హుస్సేన్‌సాగర్‌ మధ్యలో బుద్ధ విగ్రహం ఎంత పెద్దదైనా సమస్య ఏముంది? కాని గణేశ విగ్రహాలకు వచ్చే సరికి కావాలనే వాటిని పెద్దవి చేసి లేనిపోని సమస్యలకు కారణమవుతున్నారు.

వినాయక విగ్రహాల రూపకల్పనలోనూ ఈ విపరీతమే మనకు కనిపిస్తుంది. సినిమా హీరోల తరహాలోనూ క్రికెట్‌ కప్పులు రూపంలోనే వాటిని చేస్తుంటారు. రకకరాల వేషాలు వేయిస్తుంటారు. అపరిచితుడు చిత్రం వచ్చినపుడు అలాగే జులపాలతో చేశారు. ఇదంతా ఏ శాస్త్రాల ప్రకారం జరుగుతుందో చెప్పరు.అలాగే విద్యుచ్ఛక్తి సాయంతో చేయినో తొండాన్నో కదిలించేలా కూడా ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని సరదాగా వున్నంత వరకూ పర్వాలేదు గాని ఎబ్బెట్టుగానూ ఇబ్బందిగానూ వుంటే ఎలా?
పర్యావరణ గణేశులు
ఇలాటి వాతావరణంలో పర్యావరణ పరిరక్షణ దృష్టితో ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రచారం చేస్తున్న సంస్థలున్నాయి.జన విజ్ఞాన వేదికకు తోడు గ్రీన్‌ కాప్స్‌, ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి బంకమట్టి వినాయకులను చేసేందుకు శిక్షణ సరఫరా కూడా ఇస్తున్నారు.ఆ మట్టి కూడా అందజేస్తారు. ఈ విగ్రహాలు అయిదు రూపాయలకే వస్తాయి. ఈ పర్యాయం స్కూలు పిల్లలు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా విగ్రహాల తయారీలో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ హస్త కళల సంస్థ లేపాక్షిలోనూ ఈ విగ్రహాలు లభిస్తాయి. నిమజ్జనం కోసం అన్ని విగ్రహాలను ఒకేసారి హుస్సేన్‌ సాగర్‌కు తీసుకుపోయే బదులు నగరంలో వివిధ చోట్ల వున్న చెరువులను కాల్వలను ఉపయోగించుకోవడం మంచిది.
ఆ విధంగానే ఐడిఎల్‌ చెరువు దుర్గం చెరువు, హిమయత్‌ సాగర్‌ వంటి చోట్ల క్రేన్లు ఏర్పాటు చేస్తారు. విశాఖలో సముద్రం, చాలా పట్టణాల్లో నదులు వున్నాయి గనక అక్కడా నిమజ్జనం చేయొచ్చు. ఏమైనా వినాయక చవితిని తమ ప్రచారానికి ప్రాబల్యానికి పావుగా ఉపయోగించుకునేవారి పట్ల అప్రమత్తంగా వుండాల్సిందే. మత వేడుకలైనా శాంతి సామరస్యాలు పెంచాలి గాని ఉద్రిక్తతకు, కాలుష్యానికి దారి తీయకూడదు. విఘ్నాలను తొలిగిస్తాడని చెప్పే వినాయకుడి విగ్రహాలనే విఘ్నాలుగా మార్చకూడదు.
- వేమన
108 అడుగుల గణేష్‌
మహావిశాఖ పరిధిలోని గాజువాక లంక మైదానంలో 108 అడుగుల గణేష్‌ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ఇది రాష్ట్రంలోకెల్లా అతి పెద్ద వినాయక విగ్రహం. విశాఖజిల్లా అనకాపల్లి గవరపాలేనికి చెందిన రమేష్‌ ఆధ్వర్యాన కోల్‌కత్తాకు చెందిన 40 మంది కళాకారులు నెలరోజుల నుంచి విగ్రహ తయారీ పనుల్లో ఉన్నారు. కాకపోతే విగ్రహ తయారీలో ఎటువంటి రసాయనాలనూ వినియోగించడం లేదు. వెదురుకర్రలు, మట్టిని మాత్రమే వినియోగిస్తున్నారు. విగ్రహ తయారీకి కాశీ నుంచి 10 లారీల మట్టిని తెప్పించారు. దీనికి సుమారు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. 2009, 2010 సంవత్సరాల్లో ఇక్కడ 76 అడుగుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ఈ విగ్రహాన్ని నిర్మించిన చోటే నిమజ్జనం చేస్తారు. ఒక ట్యాంకర్‌ పాలు, 10 ట్యాంకర్ల నీటితో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.
-టి.రమణారావు, గాజువాక.

                                                              
వినాయక చవితి సమీపించింది. రెండు రోజుల్లో తమ తమ ఇళ్ళలో పూజించే ప్రతి ఒక్కరూ చిన్న చిన్నవిగ్రహాలను కొనుగోలు చేయడం మొదలుపెడతారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాదన్నా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. పక్కింటి వారిని చూసి పోటీ పడకుండా., పొరుగు కాలనీ వారికంటే పెద్ద విగ్రహం పెట్టాలనుకోకుండా, భారీ విగ్రహం పెట్టి మన అపార్టుమెంటులో ఇతరుల కంటే ఘనంగా చేయాలనే గొప్పలకు పోకుండా మట్టి విగ్రహాలను పెట్టి మన పరిసరాలను కాపాడుకుందాం. ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. ఈ రోజు మిత్రుడు వాసిరెడ్డి అమరనాధ్ గారు తన స్లేట్ స్కూల్ లో 2000 మట్టివిగ్రహాలను తన విద్యార్ధులకు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. పర్యావరణంపై విద్యార్ధుల్లో చైతన్యం తీసుకు రావాలనే వారి తపనను అభినందిస్తూ, గత ఏడాది కంటే మరింత మంది మట్టి విగ్రహాలు పెట్టి పూజించాలని కోరుకుంటూ సకల జనావళికి రంజాన్, వినాయక చవితి శుభాకాంక్షలు.

No comments: