Aug 26, 2011

లే థింకర్లు, లే.థింకర్లు, భలే థింకర్లు, రిలే థింకర్లు !

ముందుగా లే. థింకర్ల గురించి. లే. థింకర్స్ అంటే లే థింకర్స్ (lay thinkers) అని కాదు, ’లే’ పక్కన చుక్క ఉంది చూడండి. లే. థింకర్స్ అంటే లేటరల్ థింకర్స్ అని అండి.  మామూలుగా సూటిగా, నిటారుగా ఆలోచించకుండా కొంత అడ్డంగా, కుసింత ఐమూలగా ఆలోచించేవాళ్ళను లేటరల్ థింకర్స్ అని అంటారు. కాబట్టి వీళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని మనవి. కొన్ని సమాజాల్లో వీళ్ళని కూడా మేధావులు అనే అంటూంటారు. వీళ్ళ ఆలోచనలు సమాజం ఆలోచించే పద్ధతికి కొంత ’తేడా’గా ఉంటది. ఉదాహరణకు -
అవినీతిని ఎదుర్కొనేందుకు పదునైన చట్టం కావాలి, పళ్ళు లేనిది కాదు అని అన్నా హజారే ఉద్యమం చేస్తున్నారు కదా..
అరుంధతీ రాయనే ఒక లే.థింకరు ముందుకు దూసుకొచ్చి, ’తన ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి అన్నా హజారే ఏం మాట్టాడలేదు’ అని అన్నా మీదకు ఒక రాయి ఇసిరేసింది. నిజమే.., అన్నా ఏమీ మాట్టాడి ఉండకపోవచ్చు, మాటల మనిషి కాదు గదా! చేతల మనిషి కాబట్టి తాను చెయ్యదలచివినవేవో చేసాడు, తన ఊరిని మార్చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రజలకు స్ఫూర్తినిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తో సహా, పక్క రాష్ట్రాల వాళ్లకు మాట సాయం చేసాడు ఏం చెయ్యాలో నేర్పాడు. ఈవిడ లే. థింకరు కాబట్టి, రాళ్ళేసే బాపతు కాబట్టీ, రాళ్ళేసేసి ఊరుకుంటది. కానీ అన్నా అలాంటివాడు కాదు, పని చేసేవాడి మీద రాళ్ళు విసరడు, రాళ్ళెత్తి పనిచేస్తాడు, జనాల చేత పని చేయిస్తాడు. అంచేతే
రాలెగావ్ సిద్ధి ఇవ్వాళ కళకళ్ళాడుతోంది.

అరుంధతీ రాళ్లకీ, అన్నా హజారేకీ ఉన్న తేడా -రాలెగావ్ సిద్ధి.
మైకుల ముందుజేరి పోసుకోలు కబుర్లు చెప్పేవాళ్ళకీ ఆన్నాకీ ఉన్న తేడా -అవినీతిపై పోరాటం.
తిట్టేవాళ్లకు - అందునా, కోర్టుల్ని కూడా తిట్టి జైలుకెళ్ళొచ్చినవాళ్లకు - ఈ తేడా తెలీదు మరి.

ఇక ఇంకొందరుంటారు, ఆంధ్రభూమిలో సాక్షి లాగా! వీళ్ళు ఉత్త లే.థింకర్లు కాదు, భలే థింకర్లు! ’అన్నా హజారే, గాంధీలాంటివాడు కాదు ’ అనే ముక్క తీసుకుని గాంధీనీ ఈయన్నీ పోలుస్తూ మూణ్ణాలుగు కాలాల వ్యాసం రాసిపారేస్తారు. అంతా చదివాక, ’పాపం, ఈయన సొమ్మంతా అన్నా దోచేసుకుని ఉంటాడు, అందుకే ఈయనకు అన్నా మీద మంట లాగుంది" అని మనం అనుకుంటే అది మన తప్పేం కాదు.
 ...................................
బాబూ కొడుకులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు బొక్కేసారనే అనుమానాలు నిజమౌతున్నాయి. తండ్రి సచివాలయంలో కూచ్చుని సంతకాలు పెట్టేసి ప్రభుత్వ ఆస్తులు రాసిచ్చేస్తూ ఉంటే, రాయించుకున్నవాళ్ళు దొడ్డి దారిన కొడుకు కంపెనీల్లో పెట్టుబళ్ళు పెట్టేస్తూ ఉండేవాళ్ళంట. ఈ ముక్క కోర్టుకు చూచాయగా అర్థమై కూలంకషంగా దర్యాప్తు చేద్దామని నిశ్చయించింది. చెయ్యమని సీబీఐని ఆదేశించింది. అది దాడులు చేసి, సాక్ష్యాలు తవ్వి, అనుమానితుల మీద కేసులు కూడా పెడుతోంది.

వెంటనే లే.థింకర్లు లేచారు. లేని జూలు విదిల్చి ఓండ్రపెట్టారు.
చూసారా.. చచ్చిపోయిన మహానేతను కూడా వదలడం లేదు.
ముప్పై యేళ్ళ కుర్రాడని కూడా చూడకుండా వెంటాడుతున్నారు.
జగను వ్యాపారాలు చేసుకోవడం కూడా తప్పేనా? జగనేనా ఇంకెవరూ చేసుకోలేదా వ్యాపారాలు?
రాశేరె ఒక్కడే చేసాడా? మంత్రివర్గానికి బాధ్యత లేదా?
-ఇవీ లే.థింకర్ల వాదనలు.

ఇవన్నీ వినగానే రిలే థింకర్ల బుర్రలు నిదర లేచినై. ’రిలే’ థింకర్లు కాబట్టి సహజంగానే సొంతంగా ఆలోచించరు, పక్కోడి ఆలోచనలని రిలే చేస్తూంటారు. మహానేత పేరెత్తారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వీళ్ళు రాజీనామాలు చేసారు. ఇంతకీ.. అసలువాళ్ళు ఇద్దరూ మాత్రం రాజీనామాలు చెయ్యలేదు. వాళ్ళమనోభావాలు దెబ్బతిన్నట్టు లేవు. వాళ్లిద్దరికీ లేని దురద తమ కెందుకో ఈ కత్తిపీటలకు తెలవదు -రిలే బుర్రలు కదా!

కాసిని చిల్లర డబ్బులు పడేస్తే మనుసును మడిచేసి, మహానేత గారి మహాకొడుకు గారి మట్టికాళ్ల దగ్గర మూటగట్టి పడేసే మహాచవటల క్కూడా మనోభావాలుంటాయని మాత్రం మనకు తెలిసింది.

ఇంతా చేసీ.. వాళ్ళిద్దరూ అక్రమాలు చెయ్యలేదని ఎవరూ అనడం లేదు, గమనించండి.
...................................
ఇక లే థింకర్ల గురించి..

’లే’ పక్కన చుక్కలేదు చూడండి, వీళ్ళుత్త లే థింకర్లే (lay thinkers), లే.థింకర్లు కాదు.  లే థింకర్లంటే సగటు మనుషులు, సామాన్య మానవులన్నమాట. వీళ్ళు మామూలుగా ఆలోచిస్తారు. సూటిగా ఆలోచిస్తారు. వీళ్లలో ఒక్కరవ్వ కూడా ’మేధావితనం’ ఉండదు. అంటే మనమే నన్నమాట! అదండీ సంగతి!

No comments: