Sep 27, 2011

ఆహారంవల్ల ఎలర్జీ !!

ఎలా కనుగొంటాం?
ఆహారం తీసుకున్న అరగంటలో ముందు చెప్పిన ఏ లక్షణాలున్నా కొన్ని రకాల ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. అదే ఆహారాన్ని రెండోసారి తీసుకున్నా మళ్లీ ఆ లక్షణాలు బైటపడ్డప్పుడు ఫుడ్‌ ఎలర్జీ అనుకోవాలి.
లక్షణాలు:
ఫుడ్‌ ఎలర్జీ వచ్చిందంటే కనిపించే లక్షణాలు చికాకుపడటం, వాంతులు, వీరోచనాలు, బరువు పెరగకపోవడం వంటివి. పిల్లల్లో వాంతులు, రక్తం లేకపోవడం, రక్తవీరోచనాలు, పొట్టఉబ్బడంవంటివి కనిపిస్తాయి. పై లక్షణాలు కనిపించినపుడు పాలిచ్చే తల్లి ఆవుపాలు, గుడ్డు తినడం మానేయాలి. కొన్ని పండ్లు తిన్నపుడు దద్దుర్లు వస్తుంటాయి. ఇవికాక నువ్వులు తిన్నా కొందరిలో ఎలర్జీ కనిపిస్తుంది.
ఇతర లక్షణాలు:
కళ్లు ఎర్రబడటం, నీరుకారడం, కళ్ల చుట్టూ వాపు, ముక్కు మూసుకుపోవడం, గాలిపీల్చడం, కఫం ఉండొచ్చు. ముక్కుకారడం, పిల్లికూతలు(ఆస్తమా) ఉండొచ్చు.
క్లాస్‌ 1 ఎలర్జీ:
పాలద్వారా వచ్చే ఎలర్జీ. ఏడాదిలోపల వస్తుంది. గుడ్డు ఎలర్జీ 18 నెలలలోపల రావచ్చు. సాధారణ ఫుడ్‌ ఎలర్జీకి కారణమైన ఆహార పదార్థాలు ఆవుపాలు, గుడ్డు, చేప, వేరుశెనగపప్పులు.
క్లాస్‌ 2 ఎలర్జీ:
ఆహారపదార్థాలు కాయగూరల్లో ఉండే ప్రోటీన్‌, పండ్లలో ఉన్న ప్రోటీన్లు కూడా ఎలర్జీకి కారణాలు కావచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్‌ పోలెన్‌ ప్రోటీను లాంటివి. ఇదికాక రెండోరకం ఎలర్జీలకు కారణం యాపిల్‌, కేరెట్‌, బంగాళాదుంప, చెర్రీలు, పుచ్చకాయ, హానిడ్యూలు. వీటిని క్రాస్‌ రియాక్టింగ్‌ ఫుడ్‌ అంటారు. అంటే ఎక్కువ దిగుబడికోసం ఇతర ఆహారపదార్థాల జీన్స్‌ తీసుకొచ్చి యాపిల్‌ వంటివాటిలో కలపడంవల్ల అందులోని లక్షణాలుసైతం ఇందులోకి సరఫరా అవుతాయి. అవి తినేవారికి పడని లక్షణాలు కావచ్చు. దరిమిలా వారికి ఎలర్జీ రావచ్చు.
జాగ్రత్తలు:
1. కౌమారదశలో ఉన్న పిల్లలకు ఫుడ్‌ ఎలర్జీ ఉన్నపుడు వ్యాయామంచేస్తే ఆస్తమా రావచ్చు.
2. ఒళ్లు చల్లబడటం, చెమట, బిపి పడిపోవడం, ఆయాసం అంటే ఎనఫైలెక్సిన్‌ ఎలర్జీ లక్షణాలు కనిపిస్తే వైద్యసహాయం తప్పనిసరి.
వైద్యం ఏమిటి?
ఏ ఆహారంతో లక్షణాలు వస్తున్నాయో, పరిశీలన అవసరం. చదువు వచ్చినవాళ్లు వారం రోజులపాటు తాము తినే ఆహారం పట్టికలాగా రాసుకున్నపుడు దేనికి ఎలర్జీ వచ్చిందో సులువుగా కనుక్కోవచ్చు.
చాలావరకూ తరచూ పడవు అని చెప్పే పదార్థాలు... ఆవుపాలు, సోయా, చేప, గుడ్డు, వేరుశెనగపప్పులు. అన్నీ అందరికీ పడవని కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో పదార్థం పడదు. దీనికి పరిష్కారం వీటిని తీసుకోకుండా ఉండటమే! సమస్య మళ్లీ పునరావృతం కాదు.
ఆహారంతో ఆస్తమా ఎక్కువయ్యేవాళ్లకు సత్వరమే వైద్యసహాయం అందాలి. దద్దుర్లు, గొంతువాపు ఉన్నపుడు వైద్యసహాయం తప్పనిసరి.
నివారించడం ఎలా?
పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఏడాదిలోపల పిల్లలకు ఆవుపాలు, చేప, గుడ్డు, వేరుశెనగపప్పువంటివి ఇవ్వకూడదు. ఎలర్జీ ఉన్నపుడు, కుటుంబంలో ఎలర్జీ ఉన్నపుడు ఇవి పాలుతాగే పిల్లల తల్లుల ఆహారంలో ఇవిలేకుండా చూసుకోవాలి.
సలహాలు:
ఏడాదిలోపు పిల్లలకు ఆవుపాలు ఇవ్వొద్దు. గుడ్డు 18-24 నెలల తరువాత మొదలుపెట్టాలి. జీడిపప్పు, బాదాములు, చేప... మూడేళ్లు దాటిన తరువాత ఇవ్వాలి. చాలావరకూ చిన్నతనంలో వచ్చే ఎలర్జీలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.
ఈ ఎలర్జీ జీవితకాలం ఉండటం అనేది అరుదు. చాలావరకూ పిల్లలు, పెద్దలు దీనినుండి బయటపడతారు. కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. గుడ్డు, చేప ఎలర్జీ ఉంటే అవి ఇవ్వకుండా ఉంటే మంచిది. పాల ఎలర్జీ చాలావరకూ పెరిగి పెద్దయ్యేసరికి తగ్గిపోతుంది.

No comments: