Sep 27, 2011

డెన్మార్క్‌ తొలి మహిళా ప్రధాని హెల్లే ధోర్నింగ్‌ !

అనేక పరిణామాల నడుమ డెన్మార్క్‌ దేశం తొలి మహిళా ప్రధానిని ఎన్నుకుంది. 44యేళ్ల హెల్లె థోర్నింగ్‌ స్క్మిడిట్‌ రాజకీయాల్లో రాటుతేలిన మహిళ. ప్రధానికాదగ్గ అర్హతలు కలిగిన మహిళగా థోర్నింగ్‌ డెన్మార్క్‌లో అందరి మన్ననలు పొందుతోంది. డెన్మార్క్‌ ఆర్థిక స్థితిగతులను థోర్నింగ్‌ సమర్థవంతంగా మెరుగుపరుస్తుందనేది నేడు సర్వత్రా వినపడుతున్న వాదన. డెన్మార్క్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. గత పదేళ్లుగా డెన్మార్క్‌లో మితవాదుల పాలన సాగుతోంది. దానికి తెరదించుతూ డెన్మార్క్‌ ప్రజలు వామపక్షాలకు అధికారపగ్గాలను అందించారు. స్వల్ప మెజారిటీ అయినప్పటికీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది. సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ డెన్మార్క్‌లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
థోర్నింగ్‌ 1994లో యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హగన్‌లో పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. థోర్నింగ్‌ యూరోపియన్‌ రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె మెట్టినిల్లుసైతం రాజకీయనేపథ్యం ఉన్నదే. థోర్నింగ్‌ భర్త స్టీఫెన్‌ కిన్నాక్‌ మాజీ యూరోపియన్‌ పార్లమెంటరీ డెప్యూటీగా పనిచేశారు. అంతేకాదు గ్లేనిస్‌ మాజీ బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ ప్రముఖ నాయకుడు నీల్‌ కిన్నాక్‌ కొడుకు. బెల్జియంలో పరిచయమైన స్టీఫెన్‌ కిన్నాక్‌ను థోర్నింగ్‌ వివాహం చేసుకున్నారు. వారికిద్దరు కుమార్తెలు. కిన్నాక్‌ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పనిచేస్తున్నారు. థోర్నింగ్‌ ఐదేళ్లు యూరోపియన్‌ లా మేకర్‌గా చేశారు. 2005లో సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ తరఫున నాయకురాలిగా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల క్రితం జరిగిన డెన్మార్క్‌ ఎన్నికల్లో థోర్నింగ్‌ పోటీచేసినా ఓటమి చవిచూశారు.
సంక్షోభపు పెనుగాలులు
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం డెన్మార్క్‌నుసైతం కుదిపేసింది. ప్రసుతం ఆ దేశ ఆర్థికస్థితి లోటులో నడుస్తోంది. ఆ దేశ జిడిపి వచ్చే సంవత్సరానికి 4.6%నికి చేరుకుంటుందని ఓ అంచనా. ఆవిధంగా డెన్మార్క్‌ దేశం ఆర్థికసంక్షోభంలో నిండా కూరుకుపోయింది. ప్రజల ఆదాయమార్గాలు మూసుకుపోయాయి. వారి కొనుగోలుశక్తి తగ్గిపోయింది. సమస్యలు నలువైపులా చుట్టుముట్టాయి. దేశీయ బ్యాంకులుసైతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సంక్షోభంలో భాగంగా 2008 తొమ్మిది బ్యాంకులు దివాళాతీశాయి. థోర్నింగ్‌ తన ఎన్నికల ప్రచారంలో ఈ లోటుపాట్లనే ఆయుధాలుగా చేసుకున్నారు. ''దేశాన్ని ఈ సమస్యలనుండి గట్టెక్కించడానికి ప్రభుత్వం ఎలాంటి యత్నాలకూ పూనుకోలేదు. లెక్కాపత్రం లేకుండా అనేక అనవసరపు ఖర్చులు చేసింది. ఏమాత్రం ప్రణాళికలేకుండా వ్యవహరిస్తోంది. దేశ సంక్షోభాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ రకంగా ప్రభుత్వం విఫలమైనట్లే'' అంటూ ప్రచారంలో థోర్నింగ్‌ గత ప్రభుత్వ లోటుపాట్లను ఘాటుగా విమర్శించారు.
పెల్లుబికిన ఆగ్రహం
సంక్షోభంలో కూరుకుపోయిన తమ దేశ పరిస్థితులకు ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికింది. అది రాస్మసన్‌పై ఆగ్రహంగా మారింది. వామపక్షాలకు అధికారమిస్తే దేశ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని వారంతా అభిప్రాయపడ్డారు. దాంతో సోషల్‌ డెమొక్రాట్‌ నాయకురాలు థోర్నింగ్‌ నేతృత్వంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు సుగమమైంది. థోర్నింగ్‌ తమ సంకీర్ణ కూటమి పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. డెన్మార్క్‌లో ఉన్నది మొత్తం 179 పార్లమెంట్‌ స్థానాలు. ఎన్నడూ లేనంతవిధంగా ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా 87.7% ఓటింగ్‌ నమోదైంది. దీనివల్లనే ప్రజల్లో పూర్వ ప్రభుత్వంపట్ల, పూర్వ ప్రధాని లార్స్‌ లోకె రాస్మసన్‌పట్ల ఎంత విముఖత ఉందో, ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలని వారి మనసుల్లో ఎంత ఖచ్ఛితమైన నిర్ణయం జరిగిందో అర్థంచేసుకోవచ్చు. ఆ పట్టుదలే రాస్మసన్‌ను గద్దెదించింది. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకత సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి అనుకూలంగా పనిచేసింది.
మధ్యేవాద వామపక్ష పార్టీలైన సోషల్‌ లిబరల్‌ పార్టీ, రెడ్‌- గ్రీన్‌ పార్టీతో కలిసి థోర్నింగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని భావిస్తున్నారు. ఇలా ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి సారథ్యం వహించడానికి థోర్నింగ్‌ అన్నివిధాలా సమర్థురాలని అంతటా వినిపిస్తున్న వాదన. అయితే థోర్నింగ్‌ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి డెన్మార్క్‌ను ప్రగతిపథాన నడిపించడానికి చాలా కష్టపడాలి. అందుకు థోర్నింగ్‌ సదాసిద్ధంగానే ఉన్నారు.
డెన్మార్క్‌లో ప్రజలు థోర్నింగ్‌ను 'గుచ్చి హెల్లె' అని పిలుచుకుంటారు. గెలుపు సాధించిన సందర్భంగా హెల్లె థోర్నింగ్‌ మాట్లాడుతూ, ''మేం అనుకున్నది సాధించాం. నేడు మేమంతా కలిసి చరిత్రను సృష్టించాం'' అని ఉద్వేగంతో పలికారు. ''డెన్మార్క్‌ మార్పును కోరుకుంటోంది. డెన్మార్క్‌ ముందుకు కదలాలనుకుంటోంది. అందుకు నా శ్రాయశక్తులా ప్రయత్నిస్తాను'' అన్నారు థోర్నింగ్‌. దేశంలో పొదుపుచర్యలు చేపట్టాలి. ప్రతి ఒక్కరూ రోజుకు 12 నిముషాలు ఎక్కువగా పనిచేస్తే, వారానికి ఓ గంట అదనంగా పనిచేసినట్లే. అలాచేస్తే దేశ స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది అనుకున్నంత సులువుకాదు. అయితే కష్టసాధ్యమూ కాదు.
ఏ దిశగా చర్యలు తీసుకుంటే ఆర్థికసంక్షోభంనుండి బైటపడొచ్చో థోర్నింగ్‌ తన ప్రచారంలోనే తెలిపారు. ప్రస్తుతం థోర్నింగ్‌ ప్రజా సంక్షేమ పథకాలపైన ఎక్కువ దృష్టి సారించారు. పన్నులు పెంచకుండా దేశ స్థితిగతులను మెరుగుపరచాలనేది ఆమె ఆలోచన. డెన్మార్క్‌ ఆర్థికస్థితిని మెరుగుపరచడం, వైద్య సదుపాయాలు కల్పించడం తక్షణ కర్తవ్యాలనేది థోర్నింగ్‌ భావన. పన్నుల పెరుగుదలపైన అదుపుసాధిస్తాననీ... ప్రజల కొనుగోలుశక్తిని పెంచే దిశగా పలు చర్యలు తీసుకొంటామని థోర్నింగ్‌ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. చేసిన వాగ్దానాలను సక్రమంగా అమలుచేసి, తన దేశాన్ని, దేశ ప్రజలను ప్రగతిపథాన నడిపించాలని థోర్నింగ్‌ కోరుకుంటున్నారు.
డెన్మార్క్‌లో నేడు కానొచ్చిన పరిణామాలే ఫ్రాన్స్‌, ఇటలీల్లోనూ పునరావృతం రానుందని ఐరోపాలోని మధ్యేవాద వామపక్ష నేతలు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఆ దేశాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్ని అవరోధాలు, అడ్డంకుల నడుమ కొత్తగా అధికారంలోకి వచ్చిన సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అన్నింటినీ అధిగమించాలని కోరుకుందాం.

No comments: