Sep 1, 2011

మార్క్సిజం ఎలా పుట్టింది?

మార్క్సిజం ఎలా పుట్టిందో తెలియాలంటే ముందు కాపిటలిజం ఎలా పుట్టిందో తెలియాలి. పూర్వం వ్యాపారులు ఒక ప్రాంతంలో సరుకులు కొని గుర్రాలు, గాడిదల మీద రవాణా చేసి ఇంకో ప్రాంతంలో సంతల్లో అమ్మేవాళ్ళు. సముద్ర తీర ప్రాంతాల్లో కొంత మంది వస్తువులని ఓడల్లో ఇతర దేశాలకి రవాణా చేసి అమ్మేవాళ్ళు. సామూహిక వస్తు ఉత్పత్తి ఉండేది కాదు. కంచరివాడు రాగి చెంబు తయారు చేస్తే ఆ రాగి చెంబుని సంతలో ఒక వ్యాపారికి అమ్మితే ఆ వ్యాపారి దాన్ని ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేవాడు. అలా వస్తువులు చేతులు మారుతూ ఉండేవి. వాస్కో డా గామా యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టిన తరువాత, కొలంబస్ అమెరికా అనే కొత్త ఖండం కనిపెట్టిన తరువాత వస్తువుల రవాణా, అమ్మకాలు పెరిగాయి. వస్తువుల తయారీకి డిమాండ్ పెరిగింది. కొన్ని వందల మందిని ఒకే చోటుకి తీసుకొచ్చి వస్తువులు తయారు చెయ్యించే విధానం మొదలయ్యింది. వైన్, రమ్ లాంటి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకీ డిమాండ్ పెరిగింది. బ్రిటిష్, ఫ్రెంచ్, శ్పానిష్, పోర్టుగీస్ వ్యాపారులు అమెరికాలోని స్థానిక జాతీయులు(indigenous tribes)ని బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత వ్యవసాయ క్షేత్రాలలో పనులు చెయ్యించుకునేవాళ్ళు. కొంత మంది వ్యాపారులు ఆఫ్రికా నుంచి కొంత మందిని బానిసలుగా పట్టుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్ళి అక్కడి సంతల్లో అమ్మేవాళ్ళు. 1700ల టైమ్‌లో ఇంగ్లాండ్‌లో ఆవిరితో కదిలే యంత్రాలు వచ్చాయి. వస్త్రాల తయారీ, పుస్తకాల ముద్రణ వంటివి ఆవిరి యంత్రాలతోనే చేసేవాళ్ళు. పెట్టుబడిదారులకి ఖర్చు తగ్గి లాభాలు పెరిగాయి. కార్మికులకి మాత్రం ఎలాంటి లాభం కలగలేదు. కార్మికుడు బతికి ఉంటేనే పని చెయ్యగలడు కనుక పెట్టుబడిదారులు కార్మికులకి కేవలం బతకడానికి సరిపడా జీతాలు ఇచ్చేవాళ్ళు. కార్మికులు తాము ఎందుకు బతుకుతున్నామో తెలియక బండగా శ్రమ చేస్తూ బతికేవాళ్ళు. ఆ సమయంలో సెయింట్ సైమన్, రోబర్ట్ ఓవెన్ లాంటి ఊహాస్వర్గ సోషలిస్ట్‌లు కార్మికుల హక్కుల గురించి రచనలు వ్రాసేవాళ్ళు. కానీ ఊహాస్వర్గ సోషలిస్ట్‌లకి వర్గ పోరాట తత్వం లేదు. కార్మికులకి సహాయం చెయ్యాలని కోరుతూ పెట్టుబడిదారులూ, భూస్వాముల దగ్గరే విజ్ఞప్తులు చేసేవాళ్ళు. ఒక్క పెట్టుబడిదారుడు గానీ భూస్వామి గానీ కార్మికులకి సహాయం చెయ్యలేదు. ఆ సమయంలోనే జెర్మనీలో కార్ల్ మార్క్స్ & ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ జన్మించారు. ఇద్దరూ సామాజికంగా ఉన్నత తరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళే. ఒకరి తండ్రి లాయర్, ఇంకొకరి తండ్రి వ్యాపారి. ఇద్దరి మధ్య చిన్నప్పుడు పరిచయమేమీ లేదు కానీ వేరువేరుగా ఉంటూ సమాజాన్ని పరిశీలించారు. పెట్టుబడిదారులనీ, భూస్వాములనీ అడుక్కోవడం ద్వారా సమాజంలో మార్పు రాదనీ, వర్గ పోరాటం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనీ గ్రహించారు. మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ పెద్దైన తరువాతే ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. ఇద్దరూ హెగెల్ తత్వశాస్త్రం చదివినవాళ్ళు కావడంతో హెగెల్ తత్వశాస్త్రంలోని గతితార్కిక కోణాన్ని కార్మిక వర్గానికి అన్వయించారు. ఫోయర్‌బాక్ భౌతికవాదాన్నీ పరిశీలించారు. సమాజాన్ని లోతుగా పరిశీలించి గతితార్కిక చారిత్రక భౌతికవాదం రచించారు. వర్గ సమాజం శాస్వతం కాదనీ, వర్గ పోరాటం ద్వారా వర్గ సమాజం అంతరించి సోషలిజం వస్తుందనీ అడ్వొకేట్ చేశారు. మార్క్సిజం గురించి చెప్పాలంటే చాలా ఉంది. దాని గురించి లోతుగా చదవడానికి http://marx2mao.com వెబ్‌సైట్ ఉంది. ఇక్కడ కేవలం మార్క్సిజం ఎలా పుట్టింది అనే విషయం మాత్రమే వ్రాసాను. ఒక శాస్త్రం ఆవిర్భవించడానికి మూలం తెలిస్తే శాస్త్రం చదవడం సులభమవుతుంది.

No comments: